ముగిసిన స్వామివారి బ్రహ్మోత్సవాలు
వైభవంగా స్వామివారి పుష్పయాగం.
శ్రీస్వామి వారి హుండీ ఆదాయం 45.22 లక్షలు
శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్ 02(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవారం పుష్పయాగంతో ముగిసాయి.మార్చి19నుండి ఏప్రిల్ 2వతేది వరకు పక్షం రోజులు స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అంకురార్పణతో మొదలై పుష్పయాగంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆద్యంతం అంగరంగ వైభవంగా ముగిశాయి.
వైభవంగా స్వామివారికి పుష్పయాగం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు మంగళవారం సాయంత్రం ఆలయంలో ప్రధాన అర్చకుల వేద మంత్రాలతో అత్యంత వైభవంగా స్వామివారికి పుష్పయాగం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ఆలయ శుద్ధి,దేవత మూర్తులకు అభిషేకాలు, గోపూజ, హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యోగశాల నుండి శ్రీస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి కుంభం,కలశాలతో గర్భాలయ ప్రవేశ పూజా కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, కురు,వేరు, కదిరి మల్లెలు, సంపంగి, మరువము, గన్నేర, నందివర్ధనం, కనకాంబరం, గులాబీలు, వివిధ సుంగధ పుష్పాలతో స్వామివారికి పుష్పయాగోత్సవం కనుల పండువగా నిర్వహించారు. స్వామివారి పుష్పయాగం కార్యక్రమంలో భక్తులు పాల్గొని గోవింద నామస్మరణతో తిలకించారు. స్వామివారి హుండి ఆదాయం 45.22 లక్షలు శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి హుండి లెక్కింపు మంగళవారం నిర్వహించారు.పక్షం రోజులు బ్రహ్మోత్సవతములకు చెందిన హుండీ లెక్కింపు చేపట్టగా 45.22 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హుండి లెక్కింపు కార్యక్రమములలో పర్యవేక్షణ అధికారిగా శ్రీసత్యసాయిజిల్లా దేవాదాయశాఖ కార్యాలయ సీనియర్ సహాయకులు రమేష్ బాబు హాజరయ్యారని, హుండి లెక్కింపు కార్యక్రమములో దేవస్థానము సిబ్బంది,కెనరా బ్యాంకు శాఖ, కదిరి మేనేజర్ మధుసుధన్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. నేడు రెండో రోజు హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని ఆలయ కార్యనిర్వహణాధికారి, సిబ్బంది తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి